గణపవరం, ఏప్రిల్ 16:
తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి, ప్రముఖ సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు గారి జయంతిని గణపవరం మండల పరిధిలోని ఎం.పి.పి.ఎస్ పాఠశాలలో గురువారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి వీరేశలింగం పంతులు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన జీవిత విశేషాలను, సమాజానికి చేసిన సేవలను స్మరించుకున్నారు.
1848 ఏప్రిల్ 16న రాజమండ్రిలో జన్మించిన వీరేశలింగం పంతులు గారు తెలుగు సమాజంలో సంస్కరణలకు పునాది వేశారు. వితంతు పునర్వివాహాలను ప్రోత్సహిస్తూ 1881 డిసెంబర్ 15న ఆంధ్రదేశంలో తొలి పునర్వివాహాన్ని నిర్వహించడం ఆయన విశిష్ట కృషిగా నిలిచింది.
అలాగే బ్రహ్మ సమాజాన్ని స్థాపించి, 1905లో హితకారిణి సమాజం అనే సేవా సంస్థను ప్రారంభించి సమాజ సేవకు తన జీవితాన్ని అంకితం చేశారు.
తెలుగు సాహిత్య రంగంలో కూడా ఆయన అపార కృషి చేశారు. తొలి తెలుగు సాంఘిక నవల “రాజశేఖర చరిత్ర”, తొలి నాటకం “వ్యవహార ధర్మబోధిని” వంటి అనేక రచనలు ఆయన ప్రతిభకు నిదర్శనం.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ, విద్యార్థులు వీరేశలింగం పంతులు గారి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఎదగాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
