డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలోని రాజవరం, పేరవరం గ్రామాల్లో పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ జి.కృష్ణారావు ఆదేశాల మేరకు కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్, రావులపాలెం రూరల్ సీఐ సిహెచ్.విద్యాసాగర్ సిబ్బందితో కలిసి ఈ చర్య చేపట్టారు.
తనిఖీల్లో రికార్డు లేని 20 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పత్రాలు చూపిస్తే యజమానులకు వాహనాలు తిరిగి ఇస్తామని, లేకపోతే బ్రేక్ ఇన్‌స్పెక్టర్‌కి అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.
అదే సమయంలో రాజవరం గ్రామంలో ఓ మహిళ వద్ద 20 లీటర్ల సారా, 400 లీటర్ల బెల్లపూట గుర్తించి అరెస్ట్ చేశారు. సారా తయారీలో ఉపయోగించిన డ్రమ్ములు, గ్యాస్ స్టౌవ్‌లను స్వాధీనం చేసుకున్నారు.
మారుమూల గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ఇటువంటి తనిఖీలు కొనసాగిస్తామని పోలీసులు వెల్లడించారు.
