దేశ రాజధాని ఢిల్లీలో కుక్క కాటు ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు గంభీరంగా స్పందించింది. ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని, అన్ని వీధి కుక్కలను తక్షణమే డాగ్ షెల్టర్లకు తరలించాల్సిందిగా కీలక ఆదేశాలు జారీ చేసింది.
సుప్రీంకోర్టు జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలను ఇచ్చింది. వీలైనంత త్వరగా డాగ్ షెల్టర్లు ఏర్పాటు చేసి, తగిన సిబ్బందితో స్టెరిలైజేషన్ మరియు ఇమ్యునైజేషన్ ప్రక్రియలు చేపట్టాలని స్పష్టం చేసింది.
వీధుల్లో ఒక్క కుక్క కూడా ఉండకూడదని స్పష్టంగా చెబుతూ, వాటిని తిరిగి కాలనీలు లేదా వీధుల్లో వదిలేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ప్రజా ప్రయోజనాల కోసం కఠిన నిర్ణయం
సుప్రీం పేర్కొన్నదేమిటంటే – చిన్నారులు, శిశువులు ఎట్టి పరిస్థితుల్లోనూ వీధి కుక్కల బారిన పడకూడదు. వీధి కుక్కలను తరలించడంలో ఎవరైనా అడ్డంకి కలిగిస్తే, వారిపై కూడా చర్యలు తప్పవని స్పష్టం చేసింది.
జంతు హక్కుల స్టేపై ఆగ్రహం
వీధి కుక్కల తరలింపు కోసం ఇప్పటికే ప్రదేశం గుర్తించామని, కానీ జంతు హక్కుల కార్యకర్తలు స్టే ఆర్డర్ తెచ్చుకోవడంతో ప్రక్రియ నిలిచిపోయిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వివరించారు. దీనిపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ – “రేబిస్‌తో చనిపోయిన వారిని జంతు ప్రేమికులు తిరిగి తీసుకురాగలరా?” అని ప్రశ్నించింది.
దత్తతకు అనుమతి లేదు
వీధి కుక్కలను దత్తత తీసుకోవడానికి అనుమతించబోమని, వాటికి ప్రత్యేకంగా షెల్టర్లు నిర్మించాలనే ఆదేశం ఇచ్చింది.
హెల్ప్‌లైన్ ఆదేశం
కుక్క కాటు కేసులను నివేదించడానికి, ఒక వారంలోపు హెల్ప్‌లైన్ ప్రారంభించాలని పౌర అధికారులకు సూచించింది.
ఈ కేసును సుమోటోగా విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు, ప్రజా ప్రయోజనాల కోసం మాత్రమే ఈ ఆదేశాలు జారీ చేస్తున్నామని, జంతు ప్రేమికుల పిటిషన్లను ప్రస్తుతం విచారించబోమని స్పష్టం చేసింది.
