పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, వైఎస్సార్సీపీకి తెన్నేటి జగ్జీవన్ రాజీనామా, గత 14 సంవత్సరాలుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ, పార్టీని బలపరచడం, ప్రజల సమస్యలను పరిష్కరించడం, గ్రామ-మండల జిల్లా స్థాయిల్లో పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం కోసం అంకితభావంతో పనిచేసాను అని తెన్నేటి జగ్జీవన్ అన్నారు. ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఈ క్రింది విధముగా తెలిపారు. దీర్ఘకాల వ్యవధిలో నాకు పార్టీ అప్పగించిన పలు కీలక పదవులను గౌరవంగా నిర్వహించే అవకాశం లభించిందని, రెండు పర్యాయాలు జిల్లా కార్యదర్శిగా ఒకసారి జిల్లా ఉపాధ్యక్షుడిగా, రెండు పర్యాయాలు నియోజకవర్గ సేవదళ్ కన్వీనర్ గా, పోలవరం అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ఇంచార్జిగా, స్థానిక 13వ వార్డు ఇంచార్జిగా, జిల్లా ఎస్సీ/ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా, నియోజకవర్గ గ్రీవెన్ సెల్ అధ్యక్షుడుగా పై బాధ్యతలను నిర్వహించే సమయంలో ప్రజల సమస్యలు పరిష్కరించడం, కార్యకర్తలతో సమన్వయం, పార్టీ బలోపేతం, ఎన్నికల్లో వ్యూహాలు రూపొందించడం వంటి అనేక ముఖ్యమైన కార్యక్రమాల్లో నేను చురుకుగా పాల్గొన్నాను. అయితే ఇటీవల రాష్ట్ర పార్టీ లోను క్షేత్ర స్థాయిలోని పార్టీలో ఏర్పడిన ప్రతికూల పరిస్థితులు ముఖ్యంగా అంతర్గత కుమ్ములాటలు, ఆధిపత్య పోరు, స్థానిక కార్యకర్తలను విస్మరించడం, పార్టీ సిద్ధాంతాలకు విఘాతం కల్గించుట, కార్యకర్తలకు న్యాయం జరగకపోవడం, ఇలాంటి అంశాల వల్ల నాకు తీవ్రమైన నిరాశ, విసుగు కలిగింది. ఈ వేపద్యంలో, నాకు నేనుగా ఆత్మపరిశీలన చేసుకున్న తరువాత, వైఎస్సార్ కాంగ్రేస్ పార్టీ సభ్యత్వానికి మరియు నాకున్న అన్ని బాధ్యతలనుండి రాజీనామా చేస్తున్నాను అని ప్రకటించారు. నా రాజకీయ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాజకీయ భవిష్యత్తుపై త్వరలో నిర్ణయం తీసుకుంటావని జగ్జీవన్ తెలిపారు.
