పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం డిసెంబర్14
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను ఈ నెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు తాడేపల్లిగూడెం డివిజన్ పరిధిలో ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె. నరసింహమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ వారోత్సవాల్లో భాగంగా జిల్లా ప్రధాన కేంద్రం మరియు డివిజన్ కేంద్రాలలో విద్యుత్ పొదుపు అవగాహన ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే డివిజన్ వ్యాప్తంగా పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖన పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
స్వయం సహాయక మహిళా బృందాలకు ఇంధన సంరక్షణ పద్ధతులు, స్టార్ రేటింగ్ గృహ ఉపయోగకరణల వల్ల కలిగే లాభాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఇంజినీరింగ్ కళాశాలలలో “విద్యుత్ పొదుపు అవసరం – నూతన సాంకేతిక విజ్ఞానం” అనే అంశంపై నిపుణులచే వర్క్‌షాప్‌లు నిర్వహించనున్నట్లు చెప్పారు.
విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ పొదుపు అవసరంపై అన్ని విద్యుత్ కార్యాలయాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో జానపద కళాకారులు మరియు జన విజ్ఞాన వేదిక కార్యకర్తలతో విద్యుత్ పొదుపు అవగాహన ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
విద్యుత్ పొదుపుపై పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన పోటీలలో విజేతలకు ఈ నెల 20వ తేదీన బహుమతులు అందజేస్తామని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె. నరసింహమూర్తి తెలిపారు.
