Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
అంతర్జాతీయంఆంధ్రప్రదేశ్ఉద్యోగాలుజాతీయ వార్తలుప్రత్యేక కథనం

యువత పెరుగుతున్నా.. ఉద్యోగాలే కరువు

  • యువత పెరుగుతున్నా.. ఉద్యోగాలే కరువు
  • పేలవంగా ఉన్న శిక్షణ… నైపుణ్యం
  • ఎన్‌సిఎఇఆర్‌ నివేదిక వెల్లడి

న్యూఢిల్లీ : ఈ నెలలో నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అప్లయిడ్‌ ఎకనమిక్‌ రిసెర్చ్‌ (ఎన్‌సిఎఇఆర్‌) విడుదల చేసిన నివేదిక స్పష్టమైన హెచ్చరికను జారీ చేసింది. ‘దేశంలో ఉపాధి అవకాశాలు… ఉద్యోగాలకు దారులు’ పేరిట విడుదలైన ఈ నివేదిక పలు ఆందోళనకరమైన అంశాలను బయటపెట్టింది. దేశంలో పనిచేసే వయసున్న వారు.. ముఖ్యంగా యువత, మహిళల జనాభా వేగంగా పెరుగుతోందని, వారికి అవస రమైన స్థిరమైన ఉపాధిని అందించలేకపోతున్నామని నివేదిక తెలిపింది. తయారీ, సేవలు, ఎంఎస్ఇఎంలలో కార్మికుల కోసం పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా వృత్తిపరమైన శిక్షణను అందించలేకపోతే 2040వ దశకం నాటికి దేశ జనాభా డివిడెండ్‌ గణనీయంగా పడిపోతుందని చెప్పింది.

 

ఏటా యాభై లక్షల ఉద్యోగాల కొరత

దేశంలో పెరుగుతున్న యువత మనకు వ్యూహాత్మకమైన ఆర్థిక బలం చేకూరుస్తుందని పాలకులు చెబుతుంటారు. భారతదేశపు అత్యున్నత ప్రాధాన్యతల్లో యువత ఒకటని ప్రధాని నరేంద్ర మోడీ తరచూ అంటారు. యువ సమూహం సంపన్న భారతావనికి అతి పెద్ద లబ్ధిదారులని, భాగస్వాములని ఆయన అభివర్ణిస్తారు. వాక్చాతుర్యానికి, వాస్తవికతకు మధ్య పెరుగుతున్న అంతరాన్ని ఎన్‌సిఎఇఆర్‌ డేటా వేలెత్తి చూపింది. గత ఏడు సంవత్సరాల కాలంలో దేశంలో పనిచేయగలిగిన వయసున్న వారి సమూహంలో సుమారు తొమ్మిది కోట్ల మంది చేరారు. ఆరు కోట్ల మందికి మాత్రమే ఉపాధి లభించింది. అంటే ప్రతి సంవత్సరం యాభై లక్షల ఉద్యోగాల కొరత ఏర్పడుతోందన్న మాట. శ్రామిక శక్తి భాగస్వామ్యం (లేబర్‌ ఫోర్స్‌ పార్టిసిపేషన్‌) యాభై శాతం వద్ద స్థిరంగా ఉంది. యువతుల భాగస్వామ్యం ప్రపంచ సగటుతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది.

 

ఆటోమేషన్‌ వైపు పరుగులు

అధిక ఉపాధి లేని అధిక వృద్ధి ఒక ట్రెడ్‌మిల్‌ వంటిదని కార్మిక ఆర్థికవేత్త సంతోష్‌ మెV్ారోత్రా వ్యాఖ్యానించారు. దాని కదలిక చాలా వేగంగా ఉంటుందని, కానీ పురోగతి తక్కువగా ఉంటుందని ఆయన చెప్పారు. ఆర్థిక వృద్ధి, ఉపాధి వృద్ధి మధ్య అంతరం అధికంగా ఉంటోంది. తయారీ, సేవల రంగాలలో యాజమాన్యాలు కార్మికులకు బదులుగా యంత్రాలను ఉపయోగించుకుంటూ ఆటోమేషన్‌పై దృష్టి సారిస్తున్నారు. దేశంలో కార్మికులు, మూలధన నిష్పత్తి పోల్చదగిన ఆదాయ స్థాయిలో ఉన్న దేశాల కంటే తక్కువగా ఉంది. కార్మికుల భాగస్వామ్యం అధికంగా ఉండే దుస్తులు, వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్‌ వంటి రంగాలు ఇప్పుడు ఆటోమేటెడ్‌ ఉత్పత్తి నమూనాల వైపు మారుతున్నాయి. వ్యవసాయ రంగం సుమారు 45 శాతం కార్మిక శక్తికి ఉపాధి కల్పిస్తోంది. అది కీలక ఆర్థిక సూచీ అయిన జివిఎ (గ్రాస్‌ వాల్యూ యాడెడ్‌)కి కేవలం 15 శాతాన్ని మాత్రమే అందిస్తోంది.

 

బలహీనంగా ఉన్న శిక్షణ వ్యవస్థ

దేశంలో పారిశ్రామికీకరణ చాలా తక్కువగా, ఆలస్యంగా జరిగింది. విస్తృత తయారీ రంగాన్ని నిర్మించుకోకుండానే సేవలు అందిస్తున్నాము. ఫలితంగా తక్కువ ఉత్పాదక పనుల నుంచి లక్షలాది మందిని బయటికి పంపుతున్నాము’ అని మాజీ ప్రధాన గణాంకవేత్త ప్రణబ్‌ సేన్‌ తెలిపారు. నిపుణులు సరిగా లభించనప్పుడు కార్మికులకు ఉపాధి బలహీనపడుతుంది. దేశంలోని శ్రామిక శక్తిలో కేవలం నాలుగు శాతం మంది మాత్రమే అధికారికంగా వృత్తిపరమైన నైపుణ్యాన్ని పొందారు. అనధికారిక అప్రెంటీస్‌ షిప్‌లు అనేకం ఉన్నప్పటికీ అవి స్థిరమైన నైపుణ్యాన్ని అందించడం లేదు. కార్మికులు ఎంతగా వృత్తిపరమైన శిక్షణ పొందుతారో అంతగా ఉపాధిని చేజిక్కించుకుంటారు. దేశంలో శిక్షణ వ్యవస్థ బలహీనంగా ఉన్నదని నైపుణ్యాభివృద్ధి నిపుణురాలు అనితా రాజన్‌ చెప్పారు. ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులు, బలహీనమైన పారిశ్రామిక సంబంధాలు, పేలవంగా ఉన్న నియామకాలు వ్యవస్థను బలహీనపరుస్తున్నాయని వివరించారు. మన దేశం లక్షలాది మందికి శిక్షణ ఇస్తోంది కానీ దానిని అందిపుచ్చుకొని ప్రయోజనం పొందుతున్న వారి సంఖ్య తక్కువగానే ఉంటోంది.

 

సంస్కరణలు అవసరం

తయారీ రంగం 8.2 శాతం, సేవల రంగం 9 శాతం మేర విస్తరిస్తే 2030 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ 8 శాతం జివిఎ వృద్ధి సాధిస్తుందని ఎన్‌సిఎఇఆర్‌ అంచనా వేసింది. అంటే తయారీ రంగం ఏటా 71,543 ఉద్యోగాలు, సేవల రంగం 2,79,130 ఉద్యోగాలు కల్పించాలన్న మాట. కార్మికులను పరిశ్రమలు ప్రోత్సహించేలా ప్రభుత్వం తన విధానాలను రూపొందించుకుంటే ఉపాధి బాగానే పెరుగుతుంది. ముఖ్యంగా వస్త్రాలు, దుస్తులు, పాదరక్షల రంగాలలో ఉపాధి 53 శాతం, వాణిజ్యం, హోటళ్లు, రెస్టారెంట్లలో ఉపాధి 79 శాతం పెరగవచ్చు. అధికారికంగా శిక్షణ పొందే కార్మికుల సంఖ్య తొమ్మిది శాతం పాయింట్లు పెరిగితే 2030 నాటికి 93 లక్షల అదనపు ఉద్యోగాలను సృష్టించవచ్చు. శ్రామికుల అవసరం ఎక్కువగా ఉన్న రంగాలలో నిపుణుల సంఖ్య 12 శాతం పాయింట్లు పెరిగితే ఉపాధి అవకాశాలు 13 శాతం పెరుగుతాయి. ఈ లక్ష్యాన్ని సాధించాలంటే లోతైన సంస్కరణలు అవసరం. అర్హత కలిగిన అధ్యాపకులను నియమించి, పారిశ్రామిక సంబంధాలను బలోపేతం చేసినప్పుడే ఇది సాధ్యమవుతుంది. 20వ శతాబ్దపు నైపుణ్యంతో 21వ శతాబ్దపు ఆర్థిక వ్యవస్థను నిర్మించలేమని నీతి ఆయోగ్‌ మాజీ వైస్‌ ఛైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ స్పష్టం చేశారు.

 

వ్యవసాయేతర రంగంలో…

దేశంలో విస్తృతంగా ఉన్న అసంఘటిత వ్యవసాయేతర రంగాన్ని నివేదిక ప్రముఖంగా ప్రస్తావించింది. ఈ రంగంలో ఆరు కోట్లకు పైగా సూక్ష్మ సంస్థలు ఉన్నాయి. వీటిలో చాలా సంస్థలు ఒకే వ్యక్తితో నడుస్తున్నాయి. డిజిటల్‌ టెక్నాలజీని ఉపయోగిస్తున్న సూక్ష్మ సంస్థలు ఆ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోని సంస్థల కంటే 78 శాతం అధికంగా ఉపాధి కల్పిస్తున్నాయి. రుణ లభ్యత ఒక శాతం పెరిగితే ఉపాధి కల్పించే కార్మికుల సంఖ్య 45 శాతం పెరుగుతుంది.

Related posts

21 రోజుల ముళ్ళమ్మ జాతర ఘనంగా ముగింపు

Arnews Telugu

ఏలూరులో  శ్రీ గంగానమ్మను దర్శించుకున్న రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత

Arnews Telugu

నింగిలోకి దూసుకెళ్లిన ఎల్వీఎం-3 ఎం-6

Arnews Telugu

APEPDCLఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం డివిజన్‌లో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు

Arnews Telugu

కాశ్మీర్ అందాలను తలపించే రహమాన్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్

Arnews Telugu

భీమవరంలో పర్యటించిన కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు

Arnews Telugu