మహిళల సాధికారతకు ప్రాధాన్యామిస్తూ పనిచేస్తున్న వింగ్స్ ఆఫ్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2026 సంవత్సరాన్ని ఆరంభంగా చేసుకుని ప్రారంభించిన “సేవా నారీ మహిళా విభాగం లోగోను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆమె నివాసంలో సోమవారం ఘనంగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా హోం మంత్రి అనిత మాట్లాడుతూ, మహిళల అభివృద్ధి లేకుండా సమాజ ప్రగతి సాధ్యం కాదని, మహిళల విద్య,ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై సేవా నారీ మహిళా విభాగం తీసుకుంటున్న కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా,రాజకీయంగా, సామాజికంగా,మానసికంగా బలంగా నిలబడేందుకు ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎంతో అవసరమని,మహిళలను ప్రోత్సహించేందుకు నూతనంగా ప్రారంభించిన సేవ నారీ సంస్థను ఆమె ప్రశంసించారు.ఈ సందర్బంగా సేవా నారీ మహిళా విభాగం ద్వారా మహిళల సర్వతోముఖాభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని క్రింది నాలుగు ప్రధాన అంశాలపై కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మహిళా విభాగం
ప్రతినిధులు పేర్కొన్నారు.
(1) శక్తి – మహిళా సాధికారత, హక్కులపై అవగాహన,నాయకత్వ వికాసం,(2) శిక్షణ–విద్యా ప్రోత్సాహం,చదువు మానేసిన బాలికలకు పునఃవిద్య అవకాశాలు
(3) ఆరోగ్య–మహిళల ఆరోగ్య సంరక్షణ,అవగాహన శిబిరాలు, వైద్య సేవలు(4) ప్రతిభ– నైపుణ్యాభివృద్ధి,స్వయం ఉపాధి, వృత్తి శిక్షణ కార్యక్రమాలు ద్వారా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని మహిళలను స్వావలంబన దిశగా నడిపించడమే ప్రధాన లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు వారు తెలిపారు.ఈ లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో సేవా నారీ మహిళా విభాగం కో-ఆర్డినేషన్ మేనేజర్ వి. భాగ్యశ్రీ,ప్రోగ్రాం కో-ఆర్డినేటర్లు సి. హెచ్.కావ్య,బి.ప్రియాంక,విద్యార్థి కో-ఆర్డినేటర్లు పి.అనుష, ఆర్.నవ్యశ్రీ,పి.రేణుక,దివ్య ప్రసన్న,జయశ్రీ తో పాటు వింగ్స్ ఆఫ్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ కు చెందిన సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా సేవా నారీ మహిళా విభాగం ప్రతినిధులు మాట్లాడుతూ,మహిళల శక్తిని సమాజ నిర్మాణానికి ఉపయోగపడేలా మలచడమే తమ ధ్యేయమని,రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలను విస్తరించనున్నట్లు తెలిపారు.మహిళల అభివృద్ధి ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమనే నినాదంతో సేవా నారి మహిళా విభాగం తన ప్రయాణాన్ని ప్రారంభించడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
