ఏలూరు జిల్లా, నూజివీడు:
రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి ఆధ్వర్యంలో నూజివీడు నియోజకవర్గ కల్లు గీత కార్మికులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి, సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు కార్మికులను దుశ్శాలువాలతో సత్కరించి, కాళ్లు మొక్కిన గురుమూర్తి మాట్లాడుతూ, మద్యం దుకాణాలు, బార్లలో 10% వాటాను కల్లు గీత కార్మికులకు కేటాయించిన ఘనత చంద్రబాబుదేనని తెలిపారు. అనాడు ఎన్టీఆర్ బీసీలకు 20% రిజర్వేషన్లు కల్పించగా, చంద్రబాబు వాటిని 33%కి పెంచారని, కులవృత్తుల అభివృద్ధి, ఉన్నత విద్యలో తోడ్పాటు, ప్రమాద బీమా, పనిముట్ల సబ్సిడీ, తాడిచెట్టు పన్ను రద్దు వంటి పథకాలను అమలు చేశారని కొనియాడారు. గత వైసీపీ పాలనలో కల్లు గీత కార్మికులపై అక్రమ కేసులు, బిసి నాయకుల హత్యలు జరిగాయని విమర్శించిన ఆయన, రాష్ట్ర బీసీలు ఏకమై వైసీపీని 11 సీట్లకే పరిమితం చేశారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తూ, రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కృషి చేస్తోందని పేర్కొన్నారు.
