తెలుగుదేశం పార్టీలో సీనియర్లను పట్టించుకోవడం లేదు – దండగర్ర సర్పంచ్ పిల్లా రాంబాబు ఆవేదన
పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం మండలం
దండగర్ర గ్రామ సర్పంచ్ పిల్లా రాంబాబు తెలుగుదేశం పార్టీపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీకి 15 ఏళ్ల సేవ
పిల్లా రాంబాబు మాట్లాడుతూ –
“నేను 2008 ఎన్నికల నుండి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నాను. పార్టీ అధిష్టానం ఎవరికి సపోర్ట్ చేయమంటే వారికి తోడ్పాటు అందించాను. 2020లో ముళ్లపూడి బాపిరాజు గారి ప్రోత్సాహంతోనే నేనుఇనాడు దండగర్ర గ్రామ సర్పంచ్‌గా గెలిచాను. ఆ కృతజ్ఞతను ఎప్పటికీ మరువను” అని అన్నారు.
సీనియర్లను పట్టించుకోవడం లేదు“
ఈరోజు కొత్తగా వచ్చిన కొంతమంది నాయకులు, మండల అధ్యక్షులు సీనియర్ నాయకులను సంప్రదించడం లేదు. మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఇది చాలా బాధాకరం” అన్నారు.
ఆరుగొలను సొసైటీ ఎన్నికల వివాదం
“ఇటీవల జరిగిన ఆరుగొలను సొసైటీ ఎన్నికలలో కూడా మా దండగర్ర గ్రామానికి సంబంధించిన కార్యకర్తలను ఎవరినీ సంప్రదించలేదు. ఈ విధమైన నిర్ణయాలు తీసుకోవడం వలన కార్యకర్తల్లో తీవ్ర ఆందోళన నెలకొంది” అని తెలిపారు.
కేసులు పెట్టినా వెనక్కి తగ్గలేదు
“2021లో మా దండగర్ర గ్రామంలో ఎన్టీ రామారావు విగ్రహావిష్కరణ జరిగింది. ఆ సమయంలోనే అప్పటి శాసనసభ్యులు మాపైనే కేసులు పెట్టించారు. అయినా మేము వెనక్కి తగ్గకుండా పార్టీ కోసం నిలబడ్డాం. ఆ సమయములోనూ మేము పార్టీ పట్ల విశ్వాసంతో ఉన్నాం” అని చెప్పారు.
అభివృద్ధి పనులు – కానీ అవమానం
“కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. శాసనసభ్యులు కూడా సహకరిస్తున్నారు. అయినా ఈరోజు మా మీద గౌరవం లేకుండా వ్యవహరించడం చాలా బాధాకరం. కార్యకర్తలు నన్ను నిలదీస్తున్నారు, కానీ నేను సమాధానం చెప్పలేని పరిస్థితి వచ్చింది” అని సర్పంచ్ పిల్లా రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
