వికారాబాద్ జిల్లా ధారూర్ మండల కేంద్రంలో ఆదివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని ఓ ఫర్టీలైజర్ షాప్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మంటలు ఆకాశాన్ని అంటాయి. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది.మంటలు ఎగసిపడటాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. నీటితో మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించడంతో పాటు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నాలు చేపట్టారు. మరోవైపు పోలీసులు కూడా అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. షాప్ నిర్వాహకులకు ప్రమాద విషయాన్ని తెలియజేశారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అధికారులు పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు.
