వంగవీటి రంగా అజరామరుడు – ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస
తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, కాపు నేత వంగవీటి మోహనరంగా అజరామరుడని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయన విగ్రహాలే దానికి నిదర్శనమని పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం మండలంలో వంగవీటి మోహనరంగా విగ్రహావిష్కరణ, రూ.13 లక్షల వ్యయంతో నిర్మించిన షెడ్డు ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ, రంగా తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నానని, వెన్నుపోటు పొడిచే వారిని ఉపేక్షించనని హెచ్చరించారు. లంచం కోసం పాకులాడే పద్ధతులు తనవికాదని, గ్రామాభివృద్ధికే ప్రాధాన్యం ఇస్తానని స్పష్టం చేశారు. ప్రజలే తన బలం, గెలుపును వారికి అంకితం చేస్తున్నానని తెలిపారు.
భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం టిడిపి ఇన్చార్జి వలవల బాబ్జి మాట్లాడుతూ, రంగా ఒక సమూహ శక్తి అని, కూటమి సంపూర్ణ అభివృద్ధి కోసం పనిచేస్తుందని అన్నారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, టీడీపీ మండల అధ్యక్షుడు పరిమి రవికుమార్, జనసేన మండల అధ్యక్షుడు అడపా ప్రసాద్, బీజేపీ నాయకులు నర్సీ సోమేశ్వరరావు, సర్పంచ్ పీతల బుచ్చిబాబు, ఉప సర్పంచ్ అడపా అప్పలరాజు, సొసైటీ చైర్మన్ ఉప్పలపాటి వీరవేంకట సత్యనారాయణ, ఎంపీటీసీ నర్ని శంకరం, మాజీ సర్పంచ్ నూకల బుల్లియ్య, కాపు నాయకులు మాకా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
