పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం:
తాడేపల్లిగూడెం పట్టణంలో 64 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆఫీసర్స్ క్లబ్, దానికి అనుబంధంగా ఉన్న బీవీఆర్ కళాకేంద్రం ప్రాంగణాన్ని మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. ఈ భవనాలు ప్రభుత్వ భూమిలో ఉండటంతో, కోర్టు సముదాయానికి దారి కల్పించేందుకు ఈ చర్య చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
కళలకు, కళాకారులకు వేదికగా నిలిచిన ఈ భవనాలు నేలమట్టం కావడంతో కళాకారులు, ప్రజా సంఘాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాయి. గత నెల రోజులుగా ప్రజా సంఘాలు, కళాకారులు నిరసనలు వ్యక్తం చేస్తూ కూల్చివేతను ఆపాలని కోరినా, అధికార యంత్రాంగం పట్టించుకోలేదు.
కూల్చివేత పనుల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను మోహరించారు. మున్సిపల్ కమిషనర్ ఏసుబాబు మాట్లాడుతూ, “కోర్టు రాజమార్గం ఏర్పాటులో భాగంగా ఆక్రమణలు తొలగించాం. ఈ భూమిని ఆర్డీవోకు అప్పగిస్తాం. తదుపరి చర్యలు ఉన్నతాధికారులు నిర్ణయిస్తారు. కళాకారుల విజ్ఞప్తి మేరకు తగిన చర్యలు కూడా పరిగణలోకి తీసుకుంటాం” అని తెలిపారు.
ఈ ఘటనతో పట్టణంలో చరిత్ర, సంస్కృతి, కళలకు చెక్ పడిందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు
