ఉద్యాన పంటల్లో సాంకేతిక పరిజ్ఞానం రైతులకు అందించే విధంగా చర్యలు చేపడుతున్నామని, అందులో భాగంగా హార్టికల్చర్ యూనివర్సిటీ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు జిల్లా కలెక్టర్, కీర్తి చేకూరి పేర్కొన్నారు. మంగళవారం తాడేపల్లిగూడెం మండలం, వెంకటరామన్న గూడెం గ్రామంలో ఉన్న డాక్టర్ వై ఎస్ ఆర్ హార్టీకల్చరల్ యూనివర్సిటీలో, రాజమహేంద్రవరం రూరల్, బొమ్మూరులో ఉన్న రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తో సంయుక్తంగా సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి కోసం ఒక ముఖ్యమైన ఒప్పందం కుదుర్చుకునే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, ఉద్యాన ఉత్పత్తులను వాణిజ్యపరంగా ఉత్పత్తి చేసేందుకు మరియు వినియోగదారులకు అందించే విధానాలపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో తూర్పు గోదావరి జిల్లా హార్టికల్చర్ రంగం లో మరింత అభివృద్ధి సాధించేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. రెండు సంస్థల సహకారం ద్వారా వ్యాపారం చేసుకోవడం హార్టికల్చర్ ఉత్పత్తులపై అవగాహన కల్పించడం జరుగుతుందని, ఒక బ్రాండింగ్ తీసుకుని రావడం వ్యాపారస్తులు ఉత్పత్తులను తక్కువ ధరలకు తీసుకొని, ఎక్కువ లాభాలు పొందే విధంగా చర్యలు చేపడుతున్నారని వివరించారు. అలాగే, వినియోగదారులకు ఎగుమతి చేయడానికి అవకాశాలు కల్పించే విధంగానూ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లాలోని వ్యవసాయం, తోటివనరుల సామర్థ్యాన్ని వివరించారు. గోదావరి నీటి వనరులతో జిల్లా ప్రాంతాలు పచ్చని, సారవంతమైన భూములు కలిగి ఉన్నాయని, వ్యవసాయం–హార్టీకల్చర్ రంగాల్లో విస్తృత అవకాసాలు ఉన్నాయని తెలిపారు. విలువ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధి అత్యంత అవసరం, ఇది రైతుల ఆదాయాన్ని పెంచి, పెట్టుబడులను ఆకర్షిస్తుందని చెప్పారు. కోకో సాగు, ఆయిల్‌పామ్ సాగు విస్తరించి ఖర్చు తక్కువ చేసే పరిష్కారాలు అందిస్తున్నట్లు వివరించారు. అదనంగా, అరటి ఆకుల ఎకో-ఫైబర్, కొబ్బరి పాలు, కొబ్బరి నూనె, జీడిపప్పు వంటి విలువ ఆధారిత ఉత్పత్తులు స్థానిక పరిశ్రమల అభివృద్ధికి దోహదపడుతాయని, గ్రామీణ ఉపాధి మరియు జిల్లాలో ఆర్థిక వృద్ధిని వేగవంతం చేస్తాయని తెలిపారు.డాక్టర్ వై ఎస్ ఆర్ హార్టీకల్చరల్ యూనివర్సిటీ నుండి రిజిస్ట్రార్ డాక్టర్ బి. శ్రీనివాసులు మరియు డైరెక్టర్ డాక్టర్ కే. ధనుం జయరావు పాల్గొని, జిల్లాలో ఇన్నోవేషన్ “ఎకో-సిస్టమ్”ను మరింతగా ప్రోత్సహించే విశేషమైన ముందడుగు అని తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా జిల్లా యువత, రైతులు నూతన సాంకేతిక పరిజ్ఞానం, అగ్రశ్రేణి సాంకేతిక పరిజ్ఞానం మరియు మార్కెటింగ్ అవకాశాలు పొందగలుగుతారని తెలిపారు.ఒప్పందం అనంతరం కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో కలిసి ఉధ్యాన కళాశాలలోని పంట కొత, యాజమాన్య పరిశోధన స్థానం, విద్యార్థుల అభ్యాస పూర్వక విద్యా ప్రమాణాలు, జీవన ఎరువుల తయారీ కేంద్రం, కృషి విజ్ఞాన కేంద్రం మరియు ఇంకుబేషన్ సెంటర్ ను సందర్శించారు.ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ శాస్త్రవేత్తలతో పాటు జిల్లా పరిశ్రమల అధికారి శ్రీవనిధర్ రామన్, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు, జిల్లా హార్టికల్చర్ అధికారి ఎన్. మల్లికార్జున రావు, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ నోడల్ అధికారి టి.వి. సూర్య ప్రకాష్, సిబ్బంది పాండురంగ, చిన్ని ప్రకాష్, అరుణ, గాయత్రి, సుల్తాన్ బీబీ తదితరులు పాల్గున్నారు.
—
