ఆహా …ఏమి”టీ”
కాలం ఏదైనా… సమయం ఎంతైనా.. “టీ” అంటేనే అందరికీ నోరూరుతుంది. ఉదయం లేవగానే వేడివేడిగా.. మధ్యాహ్నం స్నేహితులతో సరదాగా… సాయంత్రం సమయాన మనసును ఉల్లాసంగా చేసుకోవడానికి… ఇలా అనేక సందర్భాల్లో టీ ఉపయోగపడుతుంది. ఇంటికొచ్చిన బంధుమిత్రులకు భోజనం మాట ఎలా ఉన్నా ఆప్యాయంగా ఓ కప్పు టీ అందిస్తే ఆ ఆనందమే వేరు. కాస్త తలనొప్పి అనిపిస్తే వేడివేడి టీ తాగగానే ఎంతటి వారికైనా ప్రాణం లేచొచ్చినంత పని అవుతుంది. ఇలా టీ అనేది అందరి జీవితాల్లో భాగస్వామ్యం అయిపోయింది.ఏమి”టీ” కబుర్లు అనుకుంటున్నారా..?
పోటీ ప్రపంచంలో కాలం వేగంగా మారిపోతున్నా సమాజంలో టీ కి లభిస్తున్న ఆదరణ ఏ మాత్రం తగ్గడం లేదు. ఆనాడు ఆంగ్లేయులు భారతీయులకు అలవాటు చేసారు ఈ టీ ని.ఆనాటి నుంచి నేటి వరకు టీ ప్రియులు పెరుగుతున్నారే తప్ప తగ్గడం లేదు. మారుమూల గ్రామాల్లో ఉండే కాకా హోటల్ నుంచి పట్టణాల్లో ఉండే నక్షత్రాల హోటల్ వరకు ఈ ఛాయ్ దే అగ్రస్థానం. ధరల పెరుగుతున్నా వినియోగం ఏ మాత్రం తగ్గడం లేదు. కాలంతో పాటే రకరకాల టీ లు పుట్టుకొస్తున్నాయి.స్తోమతను బట్టి ఈ టీ అందుబాటులో దొరుకుతుంది. వాటిల్లో బ్లాక్ టీ, మసాలా టీ, లెమన్ టీ, గ్రీన్ టీ, బెల్లం టీ వంటి ఎన్నో రకాల టీ లు ప్రస్తుతం గ్రామీణ ప్రాంతంలో కూడా అందుబాటులోకి వచ్చాయి. వీటిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టత ఉంది.ఎవరి అభిరుచికి తగ్గట్టుగా టీ లను తయారు చేసి ఇచ్చే టీ స్టాల్స్ ఇటీవలి విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ “టీ” ఆరోగ్యానికి మంచిదా చెడ్డదా అనేదానిపై అనేక చర్చలు జరుగుతూ ఉంటాయి. ఆరోగ్యానికి పెద్దిగా ప్రయోజనం లేదని వాదన బలంగా వినిపిస్తుంది. కాని వాడడం మాత్రం ఎవరూ ఆపరు. షుగర్ వ్యాధి వెంటాడుతున్నప్పటికీ ఆ షుగర్ ని తగ్గించమంటారు తప్ప వదిలిపెట్టడానికి ఎవరూ ఇష్టపడడం లేదు.రోగులకు టీ తాగొద్దని సూచించే వైద్యులు కూడా టీ తాగడాన్ని బట్టి దీని ప్రత్యేకత స్పష్టమవుతుంది.
