ప్రభుత్వ వైద్య, ఆరోగ్య వ్యవస్థపై వైసిపి అసత్య ప్రచారం చేయటం తగదని శాసన సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.జగన్ ప్రభుత్వ అసమర్ధత వల్ల గాడి తప్పిన వైద్య రంగాన్ని కూటమి ప్రభుత్వం సరిచేసి ప్రజలకు పూర్తి స్థాయి వైద్య సేవలు అందించే విధంగా అభివృద్ధి చేసిందని అన్నారు.వివిధ అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఐదు కోట్ల రూపాయల పైనే సహాయం అందించామన్నారు. అంబులెన్సులపై దుష్ప్రచారం చేయడం దారుణమని అన్నారు. అంబులెన్స్ లు పూర్తిస్థాయిలో నిర్వహిస్తున్నామని జిపిఎస్ ద్వారా పర్యవేక్షణ జరుగుతుందని ఎలాంటి ఇబ్బంది లేకుండా వైద్య సేవలు అందుతున్నాయని అన్నారు. అంబులెన్స్ చార్జీలను కూడా ప్రభుత్వం నిర్ణయించి అమలు చేస్తుందన్నారు. ఎలాంటి దోపిడీ జరగకుండా తగిన చర్యలు చేపట్టామన్నారు. ప్రజారోగ్యం విషయంలో పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో తుప్పు పట్టిన అంబులెన్స్ వ్యాన్ లను ఫోటోలు తీసి, అవి ఇప్పుడు ఉన్నట్టుగా సొంత మీడియాలో ప్రభుత్వం పై విష ప్రచారం చేయటం ప్రజలు గమనించాలని అన్నారు. వైసిపి హయాంలో ప్రజారోగ్యం పేరు చెప్పి దోపిడీ చేశారని విమర్శించారు. పిపిపి విధానం అనేది వాజ్ పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలోనే ప్రవేశపెట్టారని, జాతీయ రహదారులు నిర్మించారని గుర్తు చేశారు. ప్రభుత్వం వద్ద అవసరమైన నిధులు లేనప్పుడు పిపిపి విధానం ద్వారా అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. ఎలా నిర్మించినా వైద్య కళాశాలలు ప్రభుత్వ అధీనంలోనే ఉంటాయని తెలిపారు.దాని మీద కూడా విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేసి రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేసి అభివృద్ధికి ఆటంకం కలిగించడమే వైసిపి దురుద్దేశమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల సహకారంతో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో భారీ ఎత్తున రోడ్లు అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. గతంలో ఉపముఖ్యమంత్రిగా ఉండి రోడ్లు గుంతలు కూడా పుడ్చలేని అసమర్ధుడు మేము అభివృద్ధి చేస్తుంటే తప్పుడు విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. ఇలాంటి తప్పుడు ప్రచారం మాని సద్విమర్శలు చేయాలని కోరారు. అనంతరం ఆసుపత్రుల్లోని అత్యవసర విభాగం తదితర విభాగాలను, అంబులెన్సు లను ఎమ్మెల్యే పరిశీలించారు. ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్న రోగులను సేవల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు .ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ పాల్, తాడేపల్లిగూడెం నియోజకవర్గం బిజెపి ఇంచార్జ్ ఈటకోట తాతాజీ, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు బడుగు వెంకటేశ్వరరావు, వర్తనపల్లి కాశి, పుల్ల బాబి,పాలూరి వెంకటేశ్వరరావు, మద్దాల మణికుమార్, రామ్ లక్ష్మణ్, పేతిన గిరి, వాడపల్లి వాడపల్లి సుబ్బరాజు,కూటమి నాయకులు, ప్రభుత్వాసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
