కూటమి హయాంలో గ్రామాల అభివృద్ధి
పెంటపాడు ఎంపీపీ కట్టుబోయిన వెంకటలక్ష్మి
పెంటపాడు,జనవరి 05.
కూటమి ప్రభుత్వం హయాంలో గ్రామాలు అభివృద్ధి సాధిస్తున్నాయని పెంటపాడు ఎంపీపీ కట్టుబోయిన వెంకటలక్ష్మి అన్నారు. పెంటపాడు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సోమవారం నిర్వహించిన వి బి జి రాంజీ, స్వచ్ఛ సంక్రాంతి ప్రత్యేక గ్రామ సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సభకు గ్రామ సర్పంచ్ తాడేపల్లి సూర్యకళ అధ్యక్షత వహించారు. ఎంపీపీ కట్టుబోయిన వెంకటలక్ష్మి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గ్రామాలు ఎంతో అభివృద్ధి వైపు ముందుకు సాగుతున్నాయి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించి ప్రభుత్వం చరిత్ర సృష్టిస్తుందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ల సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ విప్, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ నియోజకవర్గం లోని గ్రామాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తున్నారన్నారు. గత 18 నెలల కాలంలో గ్రామాలలో సిసి రోడ్లు, సీసీ డ్రైన్లు నిర్మాణం పెద్ద ఎత్తున జరిగిందన్నారు. అలాగే గ్రామ పంచాయతీల సర్పంచులకు, ఎంపీటీసీ సభ్యులకు, జడ్పిటిసి, ఎంపీపీ లకు కూటమి ప్రభుత్వంలో తగిన గుర్తింపు, గౌరవం లభిస్తుందన్నారు. అదే వైకాపా ప్రభుత్వంలో అయితే స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను పట్టించుకున్న దాఖలాలు లేవని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2047 నాటికి వికసిత్ భారత లక్ష్య సాధనలో భాగంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వి వి జి రాంజీ గా పేరు మార్చారన్నారు. గతంలో సంవత్సరానికి వంద రోజులు ఉండే పని దినాలను నేడు 125 రోజులకు పెంచడం జరిగిందన్నారు. అలాగే అదనంగా కొన్ని పనులను కూడా చేసుకునే అవకాశం ఈ పథకంలో చేర్చారన్నారు. తద్వారా గ్రామాలు మరింత అభివృద్ధి సాధిస్తాయని ఎంపీపీ వెంకటలక్ష్మి తెలియజేశారు. ఈ పథకం పేరు మార్పుపై ప్రజలకు అవగాహన కలిగించారు. అలాగే ప్రభుత్వం స్వచ్ఛ సంక్రాంతి పిలుపునిచ్చిందన్నారు. పెద్ద పండుగ నాటికి పల్లెలన్నీ ఎంతో పరిశుభ్రంగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా రహదారి సౌకర్యాలను మరింత మెరుగుపరచడం జరుగుతుందన్నారు. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజలకు తెలియ చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రోత్సాహం, సహకారంతో ఎంపీపీగా మండలంలోని గ్రామాలు అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నానన్నారు. ఈ సమావేశంలో డివిజనల్ అభివృద్ధి అధికారి, ఇన్చార్జి డిఎల్పిఓ ఎం.ప్రభాకర రావు, పెంటపాడు ఎంపీడీవో రాంప్రసాద్, పంచాయతీ బోర్డు మెంబర్, ఏఎంసీ డైరెక్టర్ నల్లిమిల్లి గోపిరెడ్డి, జనసేన నాయకులు కట్టుబోయిన కృష్ణ ప్రసాద్, దాసరి శ్రీనివాస్, జామి ప్రవీణ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
