తాడేపల్లిగూడెం, జనవరి 26 :
హోటళ్లు, స్వీట్స్ షాపులు, బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, కర్రీ పాయింట్లు తదితర తినుబండారాల వ్యాపారులు ఆహార భద్రత చట్టంలో పేర్కొన్న నియమ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని ఆహార భద్రతాధికారి వెంకటరత్నం స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తాడేపల్లిగూడెం హోటల్స్, స్వీట్స్, బేకరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం స్థానికంగా ఉన్న గుణం ఫంక్షన్ హాల్‌లో ఆహార భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వెంకటరత్నం, హోటళ్లలో పాటించాల్సిన పరిశుభ్రత ప్రమాణాలు, ఆహార భద్రతా నియమాలపై విస్తృతంగా వివరించారు.
హోటళ్లలో శుభ్రత లోపిస్తే ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని తెలిపారు. ముఖ్యంగా ఆహారంలో టేస్టింగ్ సాల్ట్, కృత్రిమ రంగులు వంటి పదార్థాల వినియోగం శరీరానికి హానికరమని, దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారి తీసే అవకాశం ఉందని హెచ్చరించారు. అలాగే ప్లాస్టిక్ కవర్లలో వేడి ఆహార పదార్థాలను ఉంచడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు.
ఆహారంలో అనవసర రసాయనాల వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యాపారులు వ్యవహరించాలని సూచించారు. కొత్త ఫుడ్ సేఫ్టీ చట్టాలపై హోటల్ యజమానులు, సిబ్బందికి అవగాహన కల్పించామని, నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని వెంకటరత్నం స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా సంఘం గౌరవ అధ్యక్షులు రఘు మాట్లాడుతూ, అనవసర పోటీకి దూరంగా ఉండాలని సూచించారు. వన్ ప్లస్ వన్ ఆఫర్లు, తిన్నంత బిర్యానీ, అతి తక్కువ ధరలకు ఆహారం వంటి పథకాలు ప్రజారోగ్యానికి హానికరమని అన్నారు. నిబంధనలు పాటిస్తూ న్యాయంగా వ్యాపారం చేసేవారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు.
సంఘం పట్టణ అధ్యక్షులు వేగి శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రస్తుతం హోటల్ వ్యాపారం నష్టాల్లో ఉందని, ప్రజలు మరియు అధికారులు సహకరించాలని కోరారు. ప్రభుత్వ నిబంధనలను పాటించేలా సంఘం తగిన చర్యలు చేపడుతుందని ఆయన తెలిపారు.
ఈ అవగాహన సదస్సులో హోటల్స్ సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు, తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి చెందిన హోటల్ నిర్వాహకులు, తినుబండారాల వ్యాపారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
previous post
