తాడేపల్లిగూడెంలో జాతీయ రహదారి భద్రత మాస ఉత్సవాల అవగాహన కార్యక్రమం
తాడేపల్లిగూడెం | జనవరి 28, 2026:
పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా రవాణా అధికారి ఆదేశాల మేరకు 37వ జాతీయ రహదారి భద్రత మాస ఉత్సవాలు 01-01-2026 నుండి 31-01-2026 వరకు నిర్వహించబడుతున్నాయి.
ఈ మాస ఉత్సవాల్లో భాగంగా తాడేపల్లిగూడెం రవాణా కార్యాలయం పరిధిలోని శశి కళాశాల ప్రాంగణంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ డి. సురేందర్ సింగ్ నాయక్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూలు మరియు కళాశాల విద్యార్థులకు రహదారి భద్రత నియమాలు, వాహనాలు నడిపే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్పష్టమైన అవగాహన కల్పించారు.
ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కళాశాల బస్సుల్లో ప్రయాణించే విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అలాగే బస్సు డ్రైవర్లు మరియు ఆయాలు విద్యార్థుల సురక్షిత ప్రయాణం కోసం అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు.
విద్యార్థులు రహదారి నియమాలను పాటించడంతో పాటు, వాటిని తమ తల్లిదండ్రులకు తెలియజేసి రోడ్డు భద్రతపై సమాజంలో అవగాహన పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం మరియు లెక్చరర్లు పాల్గొని తమ అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు.
వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు రహదారి భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ డి. సురేందర్ సింగ్ నాయక్ స్పష్టం చేశారు.
