భీమవరం జనవరి 26
77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక అవార్డుల్లో యోగ మరియు సామాజిక సేవా రంగాల్లో నిస్వార్థ సేవలు అందించినందుకు గాను ఆరా ఫౌండేషన్ యోగా మాస్టర్ కరిబండి రామకృష్ణకు ఘన సత్కారం జరిగింది.
భీమవరం లోని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ నాగరాణి చేతుల మీదుగా యోగా మాస్టర్ రామకృష్ణకు అవార్డు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్, జిల్లా ఎస్పీ, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బరాయుడు తదితర ప్రముఖులు పాల్గొని అవార్డును అందజేశారు.
యోగ శిక్షణ ద్వారా సమాజంలో ఆరోగ్య అవగాహన పెంపొందించడంలో, ముఖ్యంగా యువత, మహిళలు, వృద్ధులకు యోగాను చేరువ చేయడంలో కరిబండి రామకృష్ణ విశేష కృషి చేస్తున్నారని అధికారులు ప్రశంసించారు. యోగాను జీవన విధానంగా మార్చేందుకు ఆయన చేసిన సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.
అవార్డు స్వీకరించిన అనంతరం పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, యోగా బంధువులు యోగా మాస్టర్ రామకృష్ణకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అందించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, వివిధ శాఖల ప్రతినిధులు, యోగా శిక్షణార్థులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన ఈ అవార్డు యోగ సేవలకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుందని పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు.
