తాడేపల్లిగూడెం, ఆగస్టు 11:
ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణ ప్రయత్నాలను ఆందోళనల ద్వారా ఆపుతామని రాష్ట్ర బ్యాంకు ఉద్యోగుల సంఘ కార్యదర్శి టి.వి. సూర్యనారాయణ ప్రకటించారు. సోమవారం దేశవ్యాప్తంగా ఐడీబీఐ బ్యాంకు యూనియన్లు సమ్మె నిర్వహించిన సందర్భంలో, తాడేపల్లిగూడెంలో బ్యాంకు ఉద్యోగుల కోఆర్డినేషన్ కమిటీ నాయకులు సంఘీభావం తెలిపారు.
రాష్ట్ర బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య కార్యదర్శి టి.వి. సూర్యనారాయణ, కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ ఎస్.ఎస్. ప్రసాద్ మాట్లాడుతూ, ప్రభుత్వ బ్యాంకులు దేశానికి వెన్నెముకలని, 50 ఏళ్ల చరిత్ర కలిగిన లాభదాయకమైన బ్యాంకును ప్రైవేటీకరించడం సరికాదని స్పష్టం చేశారు. ఈ ప్రయత్నాలకు వ్యతిరేకంగా భవిష్యత్తులో పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని, అవసరమైతే దేశవ్యాప్త బ్యాంకు సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు.
ప్రస్తుతం బ్యాంకు 2100 శాఖలతో, 4 లక్షల కోట్ల వ్యాపారంతో లాభాల్లో నడుస్తోందని ఆయన తెలిపారు. గతంలో యూనియన్ల ప్రతిఘటనతో ప్రైవేటీకరణ ప్రణాళికలు నిలిచిపోయినా, తాజాగా వాటాల విక్రయానికి బిడ్లు ఆహ్వానించడం ద్వారా విదేశీ ప్రైవేటు ఆర్థిక సంస్థలతో ఒప్పందాలకు దారితీస్తున్నట్లు ఆరోపించారు. ప్రభుత్వ అజమాయిషీలో ఉన్న బ్యాంకును విదేశీ కంపెనీలకు అప్పగించడం దేశ ప్రయోజనాలకు విరుద్ధమని ఆయన వ్యాఖ్యానించారు.
గ్రామీణ బ్యాంకులలో ప్రభుత్వ వాటాలను అమ్మే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని, దానివల్ల గ్రామీణ బ్యాంకుల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ శ్రీనివాస్‌తో పాటు బి. ఏడుకొండలు, జి.ఎన్.వీ. ప్రకాష్, పాలూరి సత్యనారాయణ, కె. శ్రీనివాస్, సిద్దాబత్తుల సూర్యనారాయణ, షరీఫ్, ఎం. వీరబాబు తదితరులు పాల్గొన్నారు.
