తాడేపల్లిగూడెం | జనవరి 27
మాలల రాజ్యాధికార సాధననే ప్రధాన లక్ష్యంగా మాలల రాజ్యాధికార సాధన సమితి (ఎంఆర్‌ఎస్‌ఎస్) ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు దాసరి చెన్నకేశవులు తెలిపారు.
మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో, గంజి సతీష్ బాబు, గడ్డం అచ్చిబాబు ఆధ్వర్యంలో జిల్లా కమిటీ ఏర్పాటు కోసం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన చెన్నకేశవులు మాట్లాడుతూ, మాలలు ఎన్నో సంవత్సరాలుగా సామాజికంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారని అన్నారు. మాలలను అన్ని రంగాల్లో చైతన్యవంతులుగా మార్చి, రాజ్యాధికారంలో భాగస్వాముల్ని చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎస్సీ వర్గీకరణను ఎంఆర్‌ఎస్‌ఎస్ పూర్తిగా వ్యతిరేకిస్తుందని ఆయన వెల్లడించారు. సుప్రీంకోర్టు 341వ ఆర్టికల్‌ను సవరించకుండా వర్గీకరణ సాధ్యం కాదని ఇప్పటికే స్పష్టంగా చెప్పిందని గుర్తు చేశారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ తీర్పును పక్కనపెట్టి ఏకపక్షంగా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్నాయని విమర్శించారు.
ఈ అంశంపై సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసినట్లు తెలిపారు. గత నెల 5వ తేదీన విచారణకు వచ్చిన కేసులో, ముందుగా హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచించిందని, హైకోర్టు తీర్పు ఆధారంగా మళ్లీ న్యాయపోరాటం కొనసాగిస్తామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాలల ఓటింగ్ శాతం సుమారు 42 లక్షల వరకు ఉందని, ఇది ప్రభుత్వాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నా, ఆ శక్తి మాలలకు ఇప్పటికీ పూర్తిగా తెలియడం లేదన్నారు. ఓటింగ్ శాతానికి అనుగుణంగా అధికారంలో, బడ్జెట్‌లో, రాజకీయ పదవులు మరియు నామినేటెడ్ పోస్టుల్లో మాలలకు తగిన వాటా ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
మాలల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసేలా ఎంఆర్‌ఎస్‌ఎస్ పని చేస్తుందని తెలిపారు. అలాగే మాలలతో పాటు బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కూడా వారి జనాభా ప్రాతిపదికన పోరాటం చేస్తామని చెప్పారు.
ఈ సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా కమిటీని ప్రకటించారు.
జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా దండే కనక బాబు
ప్రధాన కార్యదర్శిగా గంజి సతీష్ బాబు
రాష్ట్ర కార్యదర్శిగా గడ్డం అచ్చి బాబు
రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ఉన్నమట్ల విజయ కుమారి
నియమించినట్లు ఆయన వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గంతో పాటు రాష్ట్ర, జిల్లా స్థాయి మాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
