Arnews.in Telugu News App | Daily Telugu News Channel In Suryapeta Telangana
తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

సుస్థిర ఉద్యానానికి సాంకేతికతే భవిష్యత్‌.. డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో ఘనంగా రైతు సదస్సు

తాడేపల్లిగూడెం, జూన్ 5:
ఉద్యాన రంగంలో సాంకేతిక విప్లవాన్ని రైతులకు చేరువ చేస్తూ, ఆధునిక సాగు విధానాలపై సమగ్ర అవగాహన కల్పించాలనే లక్ష్యంతో డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన “సుస్థిర ఉద్యానం – సుభిక్ష ఫలసాయం” రైతు సదస్సు విశేష స్పందన మధ్య ఘనంగా జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెంలోని విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరిగిన ఈ సదస్సుకు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వేలాది మంది రైతులు హాజరయ్యారు.
వ్యవసాయంలో కృత్రిమ మేధస్సు (AI), డ్రోన్ టెక్నాలజీ, ఆటోమేషన్, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, వాతావరణ మార్పులకు అనుగుణమైన పంటల యాజమాన్యం వంటి అంశాలపై విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, నిపుణులు రైతులకు అవగాహన కల్పించారు. రైతుల సందేహాలను నివృత్తి చేస్తూ ఆధునిక వ్యవసాయ సాంకేతికతలను క్షేత్ర స్థాయికి తీసుకెళ్లే దిశగా ఈ సదస్సు వేదికగా నిలిచింది.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యాన రంగం రైతుల ఆదాయ వృద్ధికి కీలకంగా మారుతోందని పేర్కొన్నారు. శాస్త్రవేత్తల సలహాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు అందిపుచ్చుకోవడం ద్వారా తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉందన్నారు.
సభాధ్యక్షత వహించిన విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ కట్టుపల్లి ధనుంజయరావు మాట్లాడుతూ 2007లో స్థాపించబడిన డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం విద్య, పరిశోధన, విస్తరణ కార్యక్రమాల ద్వారా ఉద్యాన రంగ అభివృద్ధికి విశేష కృషి చేస్తోందన్నారు. ఇప్పటివరకు 38 నూతన పంట రకాలను విడుదల చేయడం విశ్వవిద్యాలయ పరిశోధనల విజయానికి నిదర్శనమని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి వందకు పైగా సంస్థలతో అవగాహన ఒప్పందాల ద్వారా విద్యార్థులు, పరిశోధకులు, రైతులకు ప్రయోజనం చేకూర్చే కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు.
సదస్సు సందర్భంగా నాబార్డ్ నిధులతో నిర్మించిన విశ్వవిద్యాలయ పరిపాలన భవన విస్తరణను, ఐసీఏఆర్ ఆర్థిక సహకారంతో నిర్మించిన బాలికల వసతిగృహ అనుబంధ భవనాన్ని ప్రారంభించారు. అలాగే ఐసీఏఆర్ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో డ్రోన్ శిక్షణ పొందిన విద్యార్థులకు డ్రోన్‌లను అందజేశారు.
విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు రూపొందించిన 18 సాంకేతిక ప్రచురణలను ఆవిష్కరించగా, ఉద్యాన విద్యార్థులు అభివృద్ధి చేసిన తేనెటీగల ఆధారిత విలువ ఆధారిత ఉత్పత్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ఉత్పత్తులకు భారత ప్రభుత్వం ప్రాథమిక పేటెంట్ మంజూరు చేయడం విశేషం.
సదస్సు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 70 ప్రదర్శన స్టాల్స్ రైతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆధునిక వ్యవసాయ పరికరాలు, డ్రోన్ వ్యవస్థలు, విలువ ఆధారిత ఉత్పత్తులు, నూతన సాంకేతిక పరిజ్ఞాన ప్రదర్శనలు రైతులకు ప్రత్యక్ష అవగాహన కల్పించాయి.
దాదాపు నాలుగు వేల మంది రైతులు, మహిళలు, విద్యార్థులు, శాస్త్రవేత్తలు పాల్గొన్న ఈ రైతు సదస్సు ఉద్యాన రంగంలో సాంకేతిక విజ్ఞాన విస్తరణకు ఒక ముఖ్యమైన వేదికగా నిలిచింది.

Related posts

పార్టీలకు అతీతంగా రూ 13 లక్షల సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ 

Arnews Telugu

ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం :ఎమ్మెల్యే బొలిశెట్టి.

Arnews Telugu

చేలో ముత్యాలమ్మ 18వ వార్షికోత్సవం – భక్తులతో నిండిన ఆలయ ప్రాంగణం

Arnews Telugu

జనసేన కార్యకర్తకు ఎమ్మెల్యే బొలిశెట్టి  ఆర్థిక సహాయం.

Arnews Telugu

స్వర్గీయ మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు విగ్రహ ఆవిష్కరణ

Arnews Telugu

ప్రజా సమస్యల పరిష్కారమే నా ఎజెండా… దర్శిపర్రు ప్రజాదర్బార్లో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్

Arnews Telugu